కలం, వెబ్ డెస్క్ : విజయవాడ సివిల్ కోర్టు (Vijayawada Civil Court) సముదాయంలో గురువారం ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. కోర్టు కార్యకలాపాల్లో భాగంగా వెళ్తున్న పలువురు న్యాయవాదులు లిఫ్టులో సుమారు గంటన్నరకు పైగా చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవనంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, ఎనిమిదో అంతస్తు వద్ద లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో న్యాయవాదులు లోపలే చిక్కుకుపోయారు. లిఫ్ట్ లో గాలి రాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ లోపల ఉన్నవారి పరిస్థితిని గమనించిన సిబ్బంది, తక్షణమే ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా లోపలికి ప్రాణవాయువును పంపిస్తూ వారికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అగ్నిమాపక శాఖ, సాంకేతిక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉన్న న్యాయవాదులు, కక్షిదారులు ఆందోళనకు గురయ్యారు.

