కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో విజయ్(Vijay) పార్టీ టీవీకే (TVK) చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి ఎన్నికలోనే హేమాహేమీలను ఓడించి రికార్డు క్రియేట్ చేసింది. టీవీకే సాధించిన అఖండ విజయం దక్షిణాదిలో రాజకీయ సంచలనంగా మారింది. సిల్వర్ స్క్రీన్‌పై తన నటన, స్టైల్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న విజయ్ ఇక రాజకీయాల్లో తన మార్క్ చూపించేందుకు సిద్దమయ్యారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన పార్టీలకు చెక్ పెడుతూ విజయ్ సరికొత్త రాజకీయ అధ్యాయాన్ని లిఖించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో తమిళనాడు ప్రజలు ఎంత బలంగా మార్పు కోరుకున్నారో స్పష్టమైంది. విజయ్ విజయానికి యువత, మహిళలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అసలు మొదటి ఎన్నికల్లోనే టీవీకే ఇంతటి ఘన విజయం ఎలా సాధించిందన్నది హాట్ టాపిక్‌గా మారింది. కేవలం విజయ్‌పై అభిమానమే మ్యాజిక్ చేసిందా? లేక ప్రధాన పార్టీలపై వ్యతిరేకత, విజయ్ ఇచ్చిన హామీలు ప్లస్ అయ్యాయా? అని చర్చ నడుస్తోంది.
ఏళ్ల తరబడి సినీ కెరీర్‌లో విజయ్ సంపాదించుకున్న కోట్లాది మంది అభిమానులతో పాటు చాలా అంశాలు విజయ్‌కి కలిసొచ్చాయి. విజయ్ తన ప్రచారంలో ఇచ్చిన హామీలు ప్రధానంగా సామాన్యుల అవసరాలను తీర్చే విధంగా ఉండటం గమనార్హం. అవినీతి రహిత పాలన, కుల రహిత రాజకీయాలు అనే నినాదంతో విజయ్ ప్రజల ముందుకు వెళ్లారు. ఇక ఉచిత నాణ్యమైన విద్య, కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం, వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్, రైతులకు గిట్టుబాటు ధర వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా పని చేశాయి. అంతే కాకుండా రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం, మహిళల భద్రతకు ప్రత్యేక రక్షణ బృందాలు వంటి హామీలు మహిళా ఓటర్లను ఆకట్టుకున్నాయి.
అలగే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల పార్టీల మాదిరిగానే విజయ్ కూడా భారీగా ఉచిత పథకాలు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇక పెళ్లి చేసుకునే అమ్మాయికి పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇస్తామని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం కూడా విజయ్ భారీ ప్రకటనలు చేశారు. తమ ప్రభుత్వంలో 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. అలాగే డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ఇక విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తామని చెప్పారు. స్కూల్ పిల్లల తల్లులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక భరోసాను ప్రకటించారు. 5 లక్షల మంది విద్యార్థులకు పెయిడ్ ఇంటర్న్ షిప్‌లకు అవకాశం కల్పిస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. 5 ఎకరాలలోపు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇలా సామాన్యులను లక్ష్యంగా చేసుకొని విజయ్ ప్రకటించిన హామీలు ఓట్లు సాధించడంలో విజయం సాధించాయనే చెప్పవచ్చు. అయితే విజయ్ ప్రజలకు ఇచ్చిన ఈ హామీలను ఏ మేరకు నెరవేరుస్తారన్నది వేచి చూడాలి.

