కలం, కరీంనగర్ : విశ్వ హిందూ పరిషత్ (VHP) కరీంనగర్ జిల్లా ప్రఖండ పర్యటనలో భాగంగా గురువారం తిమ్మాపూర్ మండలం (Thimmapur Mandal) మహాత్మానగర్లోని శ్రీ తపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో విహెచ్పీ ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మల సత్యం, ప్రాంత సేవా ప్రముఖ్ కోమల రాజేందర్ రెడ్డి, విభాగ్ కార్యదర్శి అయోధ్య రవి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ ప్రఖండ (మండల) నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తిమ్మాపూర్ మండల విహెచ్పీ అధ్యక్షుడిగా శివనాధుల శ్రీనివాస్, మండల కార్యదర్శిగా కుమ్మరాజుల హరీష్, బజరంగదళ్ మండల సంయోజక్గా వకళాభరణం మాధవ్ ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మల సత్యం మాట్లాడుతూ, హిందూ సమాజ సంఘటితమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజ హిత చింతన, సమాజ నిర్మాణం, హిందూ ధర్మ పరిరక్షణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు, వివిధ క్షేత్రాల ప్రతినిధులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

