కలం, నల్లగొండ బ్యూరో: పదవి వస్తే కొందరికి గర్వం వస్తుంది, మరికొందరికి బాధ్యత పెరుగుతుంది. కానీ చాలా అరుదుగా కొందరు నాయకులు ఎంత ఎత్తుకు ఎదిగినా తమ మూలాలను, తాము వచ్చిన దారిని అస్సలు మరువరు. “మనం తినే తిండి మనమే పండించుకోవాలి” అనే నినాదంతో అధికార హోదాలను పక్కనపెట్టి, చేతికి మట్టి అంటించుకుని పొలం బాట పట్టిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. అందులో ఒకరు తెలంగాణలో నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) కాగా.. మరొకరు ఆంధ్రప్రదేశ్‌లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu). రెండు వేర్వేరు రాష్ట్రాలు.. వేర్వేరు పదవులు.. కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే.. రైతుతో మమేకం అవ్వడం, కర్షకుడి కష్టాన్ని గౌరవించడం.
సాగు పనుల్లో నిమగ్నమైన వేముల
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తన నిరాడంబరతతో మరోసారి వార్తల్లో నిలిచారు. గన్‌మెన్లు, లగ్జరీ కార్లు, ప్రోటోకాల్ హంగామాను పక్కనపెట్టేసి, సాదాసీదా రైతులా తన వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. గోనె సంచిని భుజాన వేసుకొని, బురదలో దిగి నారుమడిలో వరి మొలకలు చల్లారు. కేవలం ఫొటోల కోసం కాకుండా, తోటి రైతులతో కలిసి బురదలోనే కూర్చుని ప్రస్తుత సాగు పరిస్థితులు, పంటలకు ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. నాయకుడు అంటే కేవలం ఏసీ రూముల్లో కూర్చుని ఆర్డర్లు వేసేవాడు కాదు, రైతన్న కష్టసుఖాల్లో భాగస్వామి కావాలని తన చర్యల ద్వారా నిరూపించారు. రాజకీయ పదవులు ఈరోజు వస్తాయి.. రేపు పోతాయి. కానీ మట్టితో ఉన్న బంధం ఎప్పటికీ శాశ్వతం అనే సందేశాన్ని వేముల వీరేశం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించారు.
View this post on Instagram
అక్కడ నిమ్మలది ఇదే తీరు..
ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైతం ఇటు పాలనలో అటు వ్యవసాయంలో తన మార్క్ చూపిస్తున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖను పర్యవేక్షించే అత్యంత కీలకమైన మంత్రి పదవిలో ఉన్నప్పటికీ, ఆయన తన సొంత పొలాన్ని నిర్లక్ష్యం చేయలేదు. స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి పొలాన్ని దున్నడం, బురదలో దిగి వరి నాట్లు వేయడం వంటి పనులను నిమ్మల రామానాయుడు నిరంతరం చేస్తుంటారు. తాము ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా, శ్రమ సంస్కృతిని విస్మరించకూడదనే ఒక గొప్ప సందేశాన్ని ఆయన యువతకు అందిస్తున్నారు.
అపవాదును తిప్పికొట్టి.. ఆదర్శంగా నిలబడి…
సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ఎన్నికల సమయంలో మాత్రమే పొలాల్లోకి వస్తారనే ఒక అపవాదు ఉంటుంది. కానీ, ఈ ఇద్దరు నేతలు ఆ అపవాదును తిప్పికొట్టారు. ఈ పరిణామం రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి యువత వ్యవసాయం వైపు రావడానికి వెనుకాడుతున్న తరుణంలో, ఇంతటి ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులే స్వయంగా నాగలి పట్టి, నారు పోస్తుంటే.. అది వ్యవసాయం పట్ల సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఒక ఏసీ రూమ్ రివ్యూ మీటింగ్‌లో తెలిసే సమస్యల కంటే, ఇలా బురదలో దిగి రైతుతో మాట్లాడినప్పుడు క్షేత్రస్థాయి ఇబ్బందులు నాయకుడికి నేరుగా అర్థమవుతాయి.
పార్టీలు, సిద్ధాంతాలు ఏవైనా.. కర్షకుడి కష్టాన్ని గుర్తించి, గౌరవించే విషయంలో వేముల వీరేశం, నిమ్మల రామానాయుడు ఇద్దరూ రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. మట్టిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడంటారు. ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎంత ఎత్తుకు ఎదిగినా.. తమ “మూలాలు” మట్టిలోనే ఉన్నాయని నిరూపించారు. అధికారం తలకెక్కించుకోకుండా, తాము కూడా మట్టి మనుషులమే అని చాటిచెప్పిన నిమ్మల రామానాయుడు, వేముల వీరేశంల తీరు.. నేటి తరం రాజకీయ నాయకులకు ఒక దిక్సూచి, ఆదర్శమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: కొత్త బంగారం పథకం వచ్చేస్తోంది!
Follow Us On: X(Twitter)

