కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ జిల్లాలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికీ పంటకుంట తవ్వడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) సూచించారు. జలసిరి కార్యక్రమం ద్వారా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లిలో వీబీ జీ రామ్జీ కార్యక్రమం ద్వారా నిర్మించిన కమ్యూనిటీ వ్యవసాయ ఇంకుడు గుంతను, నాగుల మల్యాల గ్రామంలో రైతు ఎడ్ల లత పొలం వద్ద నిర్మించిన పంట కుంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం కింద గుంతల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడం ద్వారా భవిష్యత్తులో నీటి కరువు రాకుండా చూడవచ్చని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల వద్ద పంట కుంటలు, ప్రభుత్వ భూముల్లో కమ్యూనిటీ వ్యవసాయ ఇంకుడు గుంతల నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు. వీబీ జీ రామ్జీ కార్యక్రమం ద్వారా ఈ పనులు చేపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.
జలసిరి ద్వారా నీటి వనరులు పెంపొందించేందుకు, రైతులకు మరింత మేలు చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎల్ నినో నేపథ్యంలో జలసిరి కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జి పనులను చేపట్టామని.. వీటిని నిర్మించుకునేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని సూచించారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంపై గ్రామస్తులకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో నిర్మించే కమ్యూనిటీ ఇంకుడు గుంతల్లో చేపల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన..
కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ (బావుపేట)లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. సిబ్బంది వివరాలు, వైద్య సేవలు, మందుల లభ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు కేంద్రానికి వస్తున్న రోగుల సంఖ్య, ఆరోగ్య పరీక్షల గురించి వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
మోడల్ స్కూల్, కేజీబీవీ సందర్శన..
కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, బాలికలకు కల్పిస్తున్న వసతులు, భోజన సదుపాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
పక్కాభవనాలకు భూ కేటాయింపులు పూర్తి చేయాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్డీవో, తహసిల్దార్, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా ఎలగందల్ మోడల్ స్కూల్, కేజీవీబీల్లో శానిటేషన్ మెరుగుపరచాలని అన్నారు. విద్యార్థుల కోసం కావలసిన అవసరాలు, సౌకర్యాలు, అవసరమైన మరమ్మతులకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఏఓ సంతోష్, మండల ప్రత్యేక అధికారి రణధీర్ కుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ స్వాతి, ఇంజనీర్ స్పందన, విద్యాశాఖ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఎంఏవో ఆనందం, ప్రిన్సిపాల్ లు రమాదేవి, కే శ్రీనివాస్, సర్పంచులు శ్రీనివాస్, అంజయ్య, చంద్రకళ, నిమ్మల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

