కలం, ఖమ్మం బ్యూరో: కొత్త ఇంట్లో వేడుకల సందడి నడుస్తుండగా, అదును చూసి పాత ఇంట్లో బంగారం దోచుకెళ్లిన దొంగను వేంసూరు పోలీసులు (Vemsoor Police) పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి రూరల్ సీఐ తెలిపారు. పల్లెవాడ గ్రామానికి చెందిన రైతు యలమంచి సత్యనారాయణ (65) చిన్న కుమారుడు హైదరాబాద్‌లో బ్యాంక్ జోనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం అతను తన బంగారాన్ని పాత ఇంటి బీరువా లాకర్లో దాచారు.
ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్న వీరు నవంబర్ 16న గృహప్రవేశం చేశారు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులందరికీ విందు ఏర్పాటు చేశారు. అదే రోజు ఉదయం 10 గంటల వరకు పాత ఇంట్లోని బీరువా లాకర్ సరిగ్గానే ఉంది. కానీ సాయంత్రం 7 గంటలకు పెద్ద కోడలు బీరువా తెరిచి చూడగా లాకర్ పగలగొట్టి ఉంది. అందులో ఉన్న 82 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో నవంబర్ 18న కేసు నమోదు చేసిన వేంసూరు ఎస్సై పల్లెల ప్రదీప్ బృందం దర్యాప్తు చేపట్టింది.
వేలిముద్రలు, సాంకేతిక ఆధారాల సాయంతో ఎర్రుపాలెం మండలం బీమవరం గ్రామానికి చెందిన గొల్లపూడి శ్రీహరి (25) అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 30 గ్రాముల చేతి కడియం, 48 గ్రాముల మూడు చైన్లు, 4 గ్రాముల లాకెట్‌తో పాటు పల్సర్ బైక్, మొబైల్ ఫోన్‌ను రికవరీ చేశారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ సర్వయ్య, ఎస్సై ప్రదీప్, సిబ్బంది నాగేశ్వరరావు, నాగేంద్రబాబు లను ఖమ్మం పోలీస్ కమిషనర్ అభినందించారు.

