కలం, స్పోర్ట్స్: టురిన్‌లో జరిగిన నిట్టో ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను తొలిసారి గెలుచుకున్న స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz)ను దిగ్గజం రఫెల్ నాదల్ ప్రత్యేకంగా అభినందించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను 6-2, 7-6(6) తేడాతో ఓడించి అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో అల్కరాజ్ ఎదుర్కొన్న కష్టాలను నాదల్ గుర్తు చేసుకున్నాడు. క్లిష్టమైన ఏడాదిని ఇంతటి ప్రతిష్టాత్మక టైటిల్‌తో ముగించడం చాలా ఆనందంగా ఉందని నాదల్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తెలిపాడు. రాబోయే డేవిస్ కప్ టోర్నీలోనూ అతనికి విజయం దక్కాలని ఆకాంక్షించాడు. ఏప్రిల్‌లో బార్సిలోనా టోర్నీలో మణికట్టు గాయంతో అల్కరాజ్ నాలుగు నెలలకు పైగా ఆటకు దూరమయ్యాడు.
ఆగస్టులో యూఎస్ ఓపెన్‌తో రీఎంట్రీ ఇచ్చి, టోక్యో, వియన్నా, పారిస్ టోర్నీలలో వరుస టైటిళ్లు గెలిచాడు. ఏటీపీ ఫైనల్స్‌లో మెద్వెదెవ్‌తో మ్యాచ్ సమయంలో ఎడమ కాలి నొప్పి వేధించినా కోలుకుని అజేయంగా ఫైనల్ చేరాడు. ఫైనల్లో రెండో సెట్ టై-బ్రేకర్‌లో మూడు సెట్ పాయింట్లను కాపాడుకుని మరీ అల్కరాజ్ విజయాన్ని అందుకున్నాడు. మాన్యుయెల్ ఒరాంటెస్, అలెక్స్ కొరెట్జా తర్వాత ఏటీపీ ఫైనల్స్ గెలిచిన మూడో స్పెయిన్ ఆటగాడిగా అల్కరాజ్ నిలిచాడు. ఇది అతనికి ఈ సీజన్‌లో ఆరో టైటిల్ కాగా, కెరీర్‌లో 30వ ట్రోఫీ. ఇక అందరి దృష్టి అల్కరాజ్ ఆడబోయే డేవిస్ కప్‌పైనే ఉంది.

