కలం, మహబూబ్నగర్ బ్యూరో: ప్రజావాణి (Prajavani)లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను సావధానంగా విని, వాటిని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజావాణి దరఖాస్తులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, సమస్యల తీవ్రతను అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
ప్రజావాణిలో రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల, సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాలు, భూ సర్వే–రికార్డులు, గృహ నిర్మాణం, రవాణా, పోలీసు, గిరిజన అభివృద్ధి, విద్యుత్, విద్య, వైద్య ఆరోగ్యం, గనులు, అటవీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 125 వినతులను అధికారులు స్వీకరించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ ఎ.నిర్మల, డి. ఆర్.డి.ఓ. నరసింహులు, జెడ్.పి.సి.ఈ.ఓ, ఇన్చార్జి డి.పి.ఓ వెంకట్రెడ్డి, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

