కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) విమర్శించారు. దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుపై ఎవరు ఎంత ఖర్చు చేశారు? ఎంత పని పూర్తి చేశారు? ఎన్ని పంపులు ఏర్పాటు చేశారు? అనే అంశాలపై బహిరంగ చర్చకు వస్తారా.. అని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఒక మోటారు ఆన్ చేసి నీళ్లు చూపించి ప్రాజెక్టు పూర్తయిందని చెబితే ప్రజలు నమ్మే రోజులు పోయాయని స్పష్టం చేశారు.
కాళేశ్వరం గురించి చెబుతారా..?
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడుతున్న కేటీఆర్, వారి హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు చేయడం సులభమని, కానీ అవసరమైన అనుమతులు తీసుకురావడం, నిధులు సమకూర్చడం, భూసేకరణ సమస్యలను పరిష్కరించడం, పనులు పూర్తి చేయడం సులభం కాదన్నారు.
తాగు నీటి సమస్యలు తలెత్తే అవకాశం..
జూరాల నీటిని ఇష్టానుసారంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాకు అత్యంత కీలకమైన నీటి వనరు అని, సాగునీటితో పాటు తాగునీరు, పశుపక్ష్యాదుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం నీటిని విడుదల చేసి, రేపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురావద్దని మంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.

