రైతు హక్కుల కోసం మహాసభలు.. బండ శ్రీశైలం పిలుపు

కలం, మునుగోడు: రైతులు పండించే అన్ని రకాల పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ కల్పించేలా పార్లమెంటులో చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం (Banda Srisailam) డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో(Nalgonda) నిర్వహించనున్న అఖిల భారత రైతు మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. ఆదివారం గట్టుప్పల మండల కేంద్రంలోని వెల్మకన్నె గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో మహాసభల నిర్వహణ కోసం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలకు సరైన ధరలు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల భారత్-అమెరికా మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా ఉందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు రైతులు నిరంతరం ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా అమలు విషయంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చినా రైతులకు ఆశించిన ప్రయోజనం కలగడం లేదని పేర్కొన్నారు. యూరియా, పత్తి ఆన్‌లైన్ యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పంటలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని బండ శ్రీశైలం కోరారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రాంత ప్రజలు ఆర్థిక సహకారం అందించి రైతాంగ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, దోటి శేఖర్, చిక్కుల సైదులు, బుచ్చయ్య, పర్సనగోని వెంకులు, పుల్లయ్య, కానుగుల యాదయ్య, ఎరుకల అంజమ్మ, జనగం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>