నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి: మంత్రి వాకిటి శ్రీహరి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, ప్రగతి బాటలో జిల్లా ప్రజలు కలిసిరావాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari)  కోరారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో ముందుకు సాగుతోందన్నారు. పేదల సంక్షేమం, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక సుపరిపాలనకు ఈ విజన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ , అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, శిక్షణ కలెక్టర్ ఫణి కుమార్‌తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు.

రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం..

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద నారాయణపేట జిల్లాలో 1,82,031 మంది రైతులకు రూ.259 కోట్లు జమ చేశామన్నారు. రైతు బీమా పథకం కింద 2025–26లో మరణించిన 618 మంది రైతుల కుటుంబాలకు రూ.30.90 కోట్లు అందించామన్నారు. వానాకాలం పంటల కోసం జిల్లాలో 18,251.94 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాకు 6,526 ఇళ్లు మంజూరు కాగా, 5,803 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు. 3,623 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, ఇప్పటివరకు రూ.130 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

సాగునీటి ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లు..

మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని మంత్రి శ్రీహరి వివరించారు. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చొప్పున ఇప్పటి వరకు 3,112 మంది రైతులకు రూ.366.95 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 469 ప్రభుత్వ పాఠశాలల్లో 54,680 మంది విద్యార్థులు, 11 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో 4,063 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 710 కంప్యూటర్లు అందించి ఇన్‌స్ట్రక్టర్లను నియమించామన్నారు.

చేనేతకు చేయూత..

నేతన్న పొదుపు పథకం ద్వారా నారాయణపేట జిల్లాలో 904 మంది చేనేత కార్మికులకు రూ.30 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి శ్రీహరి వెల్లడించారు. నేతన్న బీమా పథకం ద్వారా మరణించిన 23 మంది చేనేత కార్మికుల నామినీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున అందించామన్నారు. జిల్లాలో సుమారు 20.09 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు ఉన్నాయని, వీటికి వైద్య సేవల కోసం 16 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 20 ఉపకేంద్రాలు, ఒక ప్రాంతీయ పశువైద్యశాల పనిచేస్తున్నాయని వివరించారు. రిజర్వాయర్లు, చెరువుల్లో 95.34 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రతిపాదనలు అందినట్లు వెల్లడించారు. మత్స్యకారుల ప్రమాద బీమా కింద ఇప్పటివరకు ఏడు కుటుంబాలకు రూ.35 లక్షలు మంజూరు చేశామన్నారు.

క్రీడల్లో క్రీడాకారుల ప్రతిభ..

క్రీడల్లోనూ జిల్లా యువత రాణిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలను గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించగా.. రాష్ట్రస్థాయి పోటీల్లో నారాయణపేట జిల్లా క్రీడాకారులు 18 పతకాలు సాధించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాల ప్రశంస పత్రాలను అందించారు. పరేడ్ మైదానంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో నారాయణ పేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ వార్ల విజయ్ కుమార్, ఎంపీపీ శివా రెడ్డి, ఆర్డీవో రమేష్ , అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>