కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణ పేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చనిపోయిన తర్వాత వచ్చే నష్ట పరిహారం కంటే బతికి ఉన్నప్పుడు ఉండే భరోసా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నారు. కులం విషయంలో అవమాన పడిన వ్యక్తిగా తాను కుల విద్వేషాలను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పెండింగ్ నష్ట పరిహారం నిధులను ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో మాట్లాడి మంజూరు చేయిస్తానని తెలిపారు. జిల్లాలో ఇంకా బహిర్భూమికి వెళ్లే పరిస్థితి పోవాలని, అందరికీ మరుగుదొడ్లు మంజూరు చేయించాలని కలెక్టర్‌కు సూచించారు.
అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు..
నారాయణపేట జిల్లాలో అన్ని గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ప్రతి గిరిజన తండాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 25 ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సివిల్ రైట్ డే, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉల్లాస్ కార్యక్రమాలను ప్రశంసించారు జిల్లాకు ఇంకా రావాల్సిన శాఖలు, జిల్లా అధికారులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తానని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో వెంకట్ రాములు, డీఎస్పీ లింగయ్య, ఆర్డీవో రమేష్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సదాశివ రెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, ట్రైబల్ అధికారి జనార్దన్, పీఆర్ ఈఈ అశోక్, పురపాలక కమిషనర్ శంకర్, కమిటీ సభ్యులు కిష్టా నాయక్, బొట్టు రవి తదితరులు పాల్గొన్నారు.

