కలం, వెబ్ డెస్క్: దోహా డైమండ్ లీగ్ (Doha Diamond League)కు భారత స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) దూరమయ్యారు. ఈ టోర్నీ జూన్ 19 నుంచి ప్రారంభం కానుంది. కాగా వెన్నుగాయం కారణంగా నీరజ్ చోప్రా ఈ లీగ్‌లో ఆడటం లేదని అధికారక వర్గాలు తెలిపాయి. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకునే ప్రక్రియలో ఉన్న అతడు ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్, ఈ ఏడాది చివర్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలపై దృష్టి పెట్టాడు. అందుకే దోహా పోటీకి దూరంగా ఉండి ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని బియెన్‌లో 47 రోజుల ఆఫ్-సీజన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న నీరజ్, తన ఫిజియోథెరపిస్ట్ ఇషాన్ మార్వాహా, కోచ్ జై చౌదరితో కలిసి పని చేస్తున్నాడు. సీజన్ రెండో భాగానికి పూర్తి స్థాయిలో సిద్ధమవ్వడమే అతని లక్ష్యం. గత ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చరిత్ర సృష్టించాడు. 90.23 మీటర్ల త్రోతో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను దాటడంతో పాటు జాతీయ రికార్డు నెలకొల్పాడు. అయితే జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ చివరి ప్రయత్నంలో 91.06 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు.
ఈసారి దోహా పోటీలో శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగా పతిరాగే, పాకిస్థాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, ప్రపంచ ఛాంపియన్ కేశోర్న్ వాల్కాట్ సహా పలువురు అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్లు బరిలోకి దిగనున్నారు. అయినప్పటికీ నీరజ్ గైర్హాజరీ అభిమానులకు పెద్ద లోటుగానే భావిస్తున్నారు. అయితే భారత స్టార్ ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌ను పూర్తిగా తిరిగి పొందడంపైనే దృష్టి పెట్టాడు. ఈ ఏడాది జరిగే ప్రధాన టోర్నీల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో అతడు తన సన్నాహాలను కొనసాగిస్తున్నాడు.

