కలం, స్పోర్ట్స్: జింబాబ్వే టూర్‌లో అదరగొట్టిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమయ్యాడు. కొత్త దేశవాళీ సీజన్‌లో భాగంగా జరగనున్న దులీప్ ట్రోఫీ (Duleep Trophy) కోసం నెట్స్‌లో బ్యాట్‌కు పదును పెడుతున్నాడు. 15 ఏళ్ల వైభవ్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
నెట్స్‌లో డిఫెన్స్‌తో పాటు దూకుడైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ దులీప్ ట్రోఫీలో వైభవ్‌కు కీలక బాధ్యత దక్కింది. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైభవ్‌పై వెంటనే కెప్టెన్సీ భారం మోపడం తమ ఉద్దేశం కాదని ఈస్ట్ జోన్ సెలెక్టర్ ప్రవంజన్ ముల్లిక్ తెలిపారు. క్రమంగా బాధ్యతలు పెంచుతూ అతడిలో నాయకత్వ లక్షణాలను, పరిపక్వతను పెంచాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
వైభవ్(Vaibhav Sooryavanshi)కు ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉంది. బిహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాకుండా అండర్-19 ప్రపంచకప్‌లో భారత నాయకత్వ బృందంలోనూ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 151 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉండగా.. ఒక ఇన్నింగ్స్‌లో అజేయంగా 81 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతడి రాణింపుతో భారత్ తొలిసారి జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
అయితే అంతకుముందు ఇంగ్లండ్ టూర్‌లో మాత్రం వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా 20 పరుగుల మార్క్‌ను దాటలేకపోయాడు. ఇప్పటివరకు ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు వైభవ్ దృష్టి పూర్తిగా దులీప్ ట్రోఫీపైనే ఉంది.
సుదీర్ఘ ఫార్మాట్‌లో తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ టోర్నీలో అతడి ప్రదర్శనపై జాతీయ సెలెక్టర్లు కూడా దృష్టి సారించనున్నారు. ఈస్ట్ జోన్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 23న బెంగళూరులో నార్త్ జోన్‌తో ఆడనుంది. జట్టులో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీతో పాటు మహ్మద్ షమీ, ముఖేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ అహ్మద్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
Also Read : సంగక్కరతో వివాదం.. ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

