కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్నది. మొత్తం 75 లక్షల టన్నులను రైతుల నుంచి కొనాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌర సరఫరాల శాఖ ఇప్పటికే 64 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. మొత్తం టార్గెట్ రీచ్ అయ్యేంతవరకు, చివరి గింజ వరకూ కొంటామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తడిచిన ధాన్యమైనా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. మొత్తం దేశంలోనే యాసంగి సీజన్‌లో వచ్చిన వరి ఉత్పత్తిలో దాదాపు 63% తెలంగాణకు చెందినదేనని అన్నారు. కొన్ని చోట్ల అనూహ్యమైన ఇబ్బందులు వస్తున్నా ఆశించిన స్థాయిలోనే కొనుగోళ్ళు జరుగుతున్నాయన్నారు. అవసరమైన సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లను సర్దుబాటు చేస్తున్నామని, అధికారులు కూడా వాహనాలతో ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారని వివరించారు.
ఈ వారమంతా కొనుగోళ్ళు కంటిన్యూ : మంత్రి
వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి జూన్ మొదటి వారం వరకు గడువు ఉన్నదని, రైతులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.31 లక్షల మంది రైతులకు రూ.11,500 కోట్లను చెల్లించామని గుర్తుచేశారు. రైతులు ధాన్యాన్ని అమ్మిన 48-72 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతున్నదని వివరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి చాలా మేరకు వడ్లను రైస్ మిల్లులకు తరలించామన్నారు. కొనుగోళ్లలో వేగం, మిల్లులకు తరలింపు, రవాణా ఏర్పాట్లు, రైతులకు పేమెంట్ తదితరాలపై ఆయన సమీక్షించారు. వడ్లను మిల్లులకు తరలించడంతో కొనుగోలు కేంద్రాలపై ఒత్తిడి తగ్గిందన్నారు. అన్ని జిల్లాల్లో సేకరణ కార్యకలాపాలు సజావుగా సాగేలా కృషి చేసిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు మరియు పౌర సరఫరాల బృందాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేంత వరకు, మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం రేయింబవళ్లు పనిచేస్తూనే ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు.

