కలం, నల్లగొండ బ్యూరో: మేళ్లచెరువు (Mellachervu) నుండి హైదరాబాద్ (Hyderabad)కు రైల్వే మార్గం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రకటించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఇష్ట కామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రజా జీవితంలో అడుగు పెట్టాక మేళ్లచెరువుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంతో తనకు మూడు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. మేళ్లచెరువు తనకు మానస పుత్రిక లాంటిదని, తాను ప్రజా జీవితంలో పని చేసిన సుదీర్ఘ కాలంలో ఈ ప్రాంత ప్రజలకు కృష్ణా నది నుండి త్రాగు, సాగు నీరు రప్పించడం తనకు తీరని సంతృప్తినిచ్చిందన్నారు. పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న మేళ్ల చెరువుకు గతంలో తానే కేంద్రంతో మాట్లాడి రైల్వే లైన్ ఏర్పాటు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మేళ్లచెరువు మండల కేంద్రంలో వెలిసిన శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న మహా శివరాత్రి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారన్నారు. ఈ భక్తులతో పాటు స్థానికుల సౌకర్యార్థం మేళ్లచెరువు నుండి హైదరాబాద్ వరకు డబుల్ రైల్వే లైన్ ఏర్పాటు చేసి ప్యాసింజర్ రైల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సంవత్సరం కుడా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి తోడ్పాటుతో కోటి రూపాయల నిధులు విడుదల చేయించినట్లు మంత్రి వెల్లడించారు.


