epaper
Wednesday, February 18, 2026
epaper

అండగా నిలిచింది లంబాడా యువతే : సీఎం రేవంత్​

కలం, వెబ్​ డెస్క్​ : సంత్ సేవాలాల్ (Sant Sevalal) మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో లంబాడా యువత తనకు వెన్నెముకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2006లో వైఎస్సార్ హవా కొనసాగుతున్న సమయంలోనూ స్వతంత్ర జడ్పీటీసీగా తనను గెలిపించింది లంబాడా బిడ్డలేనని ఆయన గుర్తు చేసుకున్నారు. మరో నాలుగు నెలల్లో తాను రాజకీయాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలోని గిరిజన తండాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. అటవీ అధికారుల అభ్యంతరాల కారణంగా విద్యుత్ సౌకర్యం లేని తండాలకు సోలార్ పవర్ అందిస్తామని, అలాగే అన్ని తండాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో గ్రూప్ 2, 3, 4 ద్వారా భర్తీ చేసిన 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే ఉన్నారని ఆయన తెలిపారు.

ఇందిరా గాంధీ కాలంలో ఉన్నట్లుగా ప్రస్తుతం పంపిణీ చేయడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని, అందుకే యువత కేవలం భూములు లేదా తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించవద్దని ఆయన సూచించారు. చదువు ద్వారానే భవిష్యత్తు మారుతుందని, చదువుకోవడానికి అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు.

లంబాడా యువత నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగితే ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని గతంలో కేసీఆర్​ మోసం చేశారని గుర్తు చేశారు. తాము అధ్యక్షా అని పిలిచేలా ఒక దళితుడిని స్పీకర్​ ని చేశామని పేర్కొన్నారు.

Read Also: ఎన్నిక‌ల్లో ఓడిపోయా.. డ‌బ్బు, చీర‌లు తిరిగిచ్చేయండి!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>