కలం, స్పోర్ట్స్: ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ (Weightlifting Championships)లో భారత లిఫ్టర్ల ప్రదర్శన భిన్నంగా సాగింది. మహిళల 61 కిలోల విభాగంలో ఉషా అదరగొట్టగా.. నిరుపమ దేవి నిరాశపరిచింది. ఉషా 212 కిలోలతో గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలవగా.. 211 కిలోలతో నిరుపమ గ్రూప్-సిలో నాలుగో స్థానానికి పరిమితమైంది. 23 ఏళ్ల ఉషా స్నాచ్‌లో 93 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కిలోలు ఎత్తింది. మొత్తం 212 కిలోలతో తన గ్రూప్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. చివరి ప్రయత్నంలో 121 కిలోలు ఎత్తడంలో మాత్రం విఫలమైంది. 63 కిలోల నుంచి 61 కిలోలకు మారిన నిరుపమ.. స్నాచ్‌లో 91 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 120 కిలోలు ఎత్తింది. చివరి ప్రయత్నాల్లో 93, 124 కిలోలు ఎత్తలేకపోయింది. దీంతో ఉషా కంటే ఒక్క కిలో వెనుకబడి పోటీ ముగించింది.
ఇప్పటివరకు గ్రూప్-సీ, డీ పోటీలు ముగియగా.. మొత్తం ర్యాంకింగ్స్‌లో ఉషా మూడో స్థానంలో, నిరుపమ ఐదో స్థానంలో ఉన్నాయి. అయితే ఇవి తాత్కాలిక ర్యాంకులే. అత్యధిక ఎంట్రీ టోటల్స్ ఉన్న లిఫ్టర్లు పోటీపడే గ్రూప్-ఏ ఫలితాల తర్వాతే తుది స్థానాలు ఖరారవుతాయి. 2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియలో భాగంగా జరిగే తొలి దశలోని ఆరు కీలక పోటీల్లో ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కూడా ఒకటి. దీంతో గ్రూప్-ఏ పోటీల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

