కలం, జగిత్యాల: తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కమల సునామీ రాబోతోందని, వచ్చే ఎన్నికల్లో 2/3వ వంతు భారీ మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని మోతే చెరువు అభివృద్ధి పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, స్థానిక నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు..
అధికారం దక్కించుకోవడం కోసం రాజ్యాంగబద్ధంగా భూమికి, ఆకాశానికి మధ్య ఉన్న ప్రతీ మార్గాన్ని ఉపయోగిస్తామని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. “మాకు ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు. ఢిల్లీ, బెంగాల్‌లలో ప్రత్యర్థులను ఏ రీతిలో ఓడించామో, తెలంగాణలోనూ అదే వ్యూహంతో ఒంటరిగానే బరిలోకి దిగి మట్టికరిపిస్తాం” అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేటీఆర్ సోషల్ మీడియా వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. “కేటీఆర్ ఏ టైంలో ట్వీట్లు చేస్తున్నాడో ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
జగిత్యాలను భ్రష్టు పట్టించారు..
స్థానిక ఎమ్మెల్యే సంజయ్ తీరుపై ఎంపీ అరవింద్ మండిపడ్డారు. “సంజయ్ ముమ్మాటికీ బీఆర్ఎస్ మనిషే. 2014 నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతల్లో ఉండి కూడా జగిత్యాలను అభివృద్ధి చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించారు” అని తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తి వైఫల్యం చెందారని విమర్శించారు.
కేంద్ర నిధులు ఇచ్చినా శంకుస్థాపనలకే పరిమితమా?
మోతే చెరువు సుందరీకరణ పనుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని ఎంపీ ఎత్తిచూపారు. అమృత్ 2.0 పథకం కింద చెరువు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి 6 నెలలు గడిచినా పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కేవలం శంకుస్థాపనల బోర్డులు వేసి పనులను గాలికి వదిలేయడం ఏంటని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని అసమర్థ పాలన నడుస్తోందని నిప్పులు చెరిగారు.

