కలం, వరంగల్ బ్యూరో: కుటుంబ బాధ్యతలతో పాటు పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా పోలీసులు శాఖకు మంచి పేరు తీసుకువస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత (Warangal Police) ప్రశంసించారు. మహిళా పోలీసుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్యం, సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ఆదివారం భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు సుమారు 360 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు.)
ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ… విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ కుటుంబ, వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత పాటించాలని సూచించారు. మహిళా సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. న్యూట్రిషనిస్ట్ శ్రీలత సమతుల్య పౌష్టికాహారం, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు.
సైకాలజిస్ట్ ప్రొఫెసర్ రాధా మాట్లాడుతూ విధి నిర్వహణలో, కుటుంబ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించేందుకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సానుకూల దృక్పథం, భావోద్వేగ నియంత్రణ, తగిన విశ్రాంతి, కుటుంబ సభ్యుల సహకారం మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో మహిళా ఇన్‌స్పెక్టర్లు సువర్ణ, సుజాత, ఎస్సైలు కిరణ్మయి, శ్రావణి, లలిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

