కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ (US-Iran) మధ్య యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. శాంతి ఒప్పందం (Peace Deal)పై అమెరికా, ఇరాన్ దేశాధినేతలు సంతకాలు చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఒప్పందంలో 14 అంశాలు ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు వర్సయిల్స్ ప్యాలెస్‌లో హాజరైన విందు సమయంలో ట్రంప్ శాంతి ఒప్పంద ప్రతిపాదనపై సంతకం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ కూడా ఈ ‘ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్’ ఎలక్ట్రానిక్ పద్ధతిలో పూర్తయిందని, ఇది తక్షణమే అమలులోకి వచ్చిందని తెలిపారు. దీంతో శుక్రవారం స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అధికారిక సంతకాల కార్యక్రమం రద్దయింది.
ఈ చారిత్రాత్మక ఒప్పంద పత్రాలపై గత ఆదివారమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్ డిజిటల్ సంతకాలు చేశారు. ట్రంప్ సమక్షంలో జరిగిన ఈ ప్రక్రియ తర్వాత, బుధవారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ దీన్ని అధికారికంగా ఖరారు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం గత కొన్ని నెలలుగా మూసివేసి ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడానికి కారణమైన హార్ముజ్ జలసంధిని 30 రోజుల్లో తిరిగి తెరుస్తారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన యురేనియం అంశానికి ఈ ఒప్పందంలో పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదు. మరోవైపు ఇరు దేశాలు లెబనాన్‌ను శాంతి ఒప్పందంలో భాగం చేశాయి. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయబోమని హామీ ఇచ్చింది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్న చమురు ఆంక్షలను అమెరికా తక్షణమే ఎత్తివేస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమంపై తుది నిర్ణయం జరిగిన తర్వాత, ప్రాంతీయ దేశాల మద్దతుతో 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధిని అందజేస్తామని, అలాగే అమెరికా డాలర్ అంతర్జాతీయ స్థాయిని కాపాడటానికి గతంలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను తిరిగి ఇచ్చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అమెరికా దళాలు మళ్లీ దాడి చేస్తాయని ట్రంప్ హెచ్చరించారు.

