కలం, స్పోర్ట్స్ : మహిళల క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు (Smriti Mandhana) మరో కీలక బాధ్యత లభించింది. బాలికల ఆరోగ్యం, సంక్షేమం, క్రీడల్లో సమాన అవకాశాలపై అవగాహన కల్పించేందుకు యునిసెఫ్ ఇండియా (UNICEF India) ఆమెను సెలబ్రిటీ అడ్వొకేట్‌గా నియమించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం, క్రీడల్లో సమాన అవకాశాల కోసం స్మృతి కృషి చేయనున్నారు. ఈ బాధ్యత దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు స్మృతి మంధాన తెలిపారు. క్రికెట్ తనకు ప్రతి కల ఒక అవకాశంతోనే ప్రారంభమవుతుందని నేర్పిందని చెప్పారు. కష్టపడటం, పట్టుదలతో పాటు సరైన ప్రోత్సాహం లభిస్తే అసాధారణ విజయాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి పెద్ద కలలు కనడానికి, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
స్మృతికి కొత్త బాధ్యత లభించడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. మైదానంలో లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్న ఆమె.. పిల్లల హక్కుల కోసం కూడా గొప్ప గొంతుకగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ సైతం స్మృతి ప్రయాణం బాలికలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ప్రతిభకు తగిన అవకాశాలు కల్పిస్తే బాలికలు ఉన్నత శిఖరాలను చేరుకోగలరని తెలిపారు. బాలికలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే యునిసెఫ్–ఐసీసీ కార్యక్రమాలకు స్మృతి మద్దతుగా నిలిచారు. తాజాగా సెలబ్రిటీ అడ్వొకేట్‌గా కొత్త బాధ్యతలు చేపట్టడంతో బాలికల సంక్షేమం, హక్కులు, క్రీడల్లో సమాన అవకాశాల కోసం తన ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు.

