కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ డ్రగ్స్ కేసు (Hyderabad Drug Case)లో కీలక పరిణామం చోటు చేసుకుది. ఈ కేసులో గోవాకు చెందిన ఓ పెడ్లర్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే 9న పంజాగుట్ట పోలీసులు 13 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల చరాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనాగుతోంది. ఈ సందర్భంగా డ్రగ్స్ సరఫరా దారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గోవాకు చెందిన కస్టోడియో ఫెర్నాండెజ్ అలియాస్ క్రిస్టీని తెలంగాణ ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది.
క్రిస్టీ బ్యాంకు ఖాతాల్లో రూ.48.4 లక్షల ట్రాన్సాక్షన్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా నగదు డిపాజిట్లు జరిగినట్లు గుర్తించారు. నిందితుడికి తెలంగాణకు చెందిన 25 మందికి పైగా వ్యక్తులతో డ్రగ్స్ నెట్‌వర్క్ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్లు చేసి క్రిస్టీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఆయా కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ డెలివరీల సమన్వయంలో ఓ నైజీరియన్ వ్యక్తి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు గోవా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1908కు కాల్ చేయాలని లేదా 87126 71111 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు.

