కలం, వెబ్ డెస్క్ : భువనేశ్వర్ (Bhubaneswar) రైల్వే స్టేషన్ సమీపంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జార్పాడా వంతెన సమీపంలో ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడం తీవ్ర కలకలం రేపింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో రైళ్లు స్వల్పంగా ఢీకొన్నాయి. రెండు ఖాళీ భోగీలు స్వల్పంగా ఢీ కొనడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి నష్టం సంభవించలేదు.
ఒక ఖాళీ రైలు రేక్ భువనేశ్వర్ నుండి మంచేశ్వర్ కోచ్ మెయింటెనెన్స్ డిపోకు .. మరొక ఖాళీ రైలు అదే మార్గంలో మంచేశ్వర్ కోచ్ మెయింటెనెన్స్ డిపో నుండి భువనేశ్వర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే సీనియర్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో లోకో పైలట్లు క్షేమంగా ఉన్నట్లు తేలింది. ఈ ఘటనపై సాధారణ రైలు సేవలకు పెద్దగా అంతరాయం కలగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ సంఘటన రైల్వే భద్రత, కార్యచరణ నిఘాపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తాజా ఘటనతో రైల్వే ప్రయాణాలు చేసే ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి.

