కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా తుని (Tuni Road Accident) పట్టణ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డి-మార్ట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. మంగళవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒడిశా నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఘటనలో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

