కలం, వెబ్ డెస్క్ : అనకాపల్లి (Anakapalli) జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. రేగుపాలెం (Regupalem) సమీపంలోని జాతీయ రహదారిపై భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న తులసి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపాడు. అప్రమత్తమైన ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు నుంచి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
అయితే క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను సర్దుబాటు చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు.

