వానాకాలం వడ్ల కొనుగోళ్లకు సర్కార్ సిద్ధం.. ఈసారి ‘ఎస్‌హెచ్‌టీ’ విధానం!

కలం, తెలంగాణ బ్యూరో: వానాకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లకు (Paddy Procurement) ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈసారి దాదాపు 65 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన పౌర సరఫరాల శాఖ.. అక్టోబర్ మొదటి వారం నుంచి కొనుగోలు సెంటర్లను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వడ్ల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి ఎస్‌హెచ్‌టీ (స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగకుండా ధాన్యాన్ని వేగంగా తరలించడానికి, రవాణా ఇబ్బందులు లేకుండా చూడడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నది.

పక్కా ప్రణాళికతో ముందుకు..

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం నిల్వ చేయడానికి అవసరమైన స్థలాలను (స్టోరేజ్ ఫెసిలిటీస్) పెంచడంపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. సాధారణ గోదాములతో పాటు మూతపడిన రైస్ మిల్లులు, ఇండస్ట్రియల్ షెడ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఆవరణలు, ఫంక్షన్ హాళ్లను కూడా ధాన్యం నిల్వ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. గుర్తించిన ప్రాంతాల్లో రిపేర్లు కూడా చేస్తున్నారు. కవర్ అండ్ ప్లింత్ (క్యాప్) విధానంలో పకడ్బందీగా ధాన్యాన్ని భద్రపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇతర శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నారు. కేంద్రాల్లో తేమను కొలిచే యంత్రాలు (మాయిశ్చర్ మీటర్లు), క్లీనర్లు, డ్రయ్యర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ధాన్యం రవాణాలో అక్రమాలను అడ్డుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ధాన్యం తరలించే ప్రతి లారీకి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేశారు. దీంతో స్టాక్ డైవర్షన్‌కు తావుండదు.

కమిషనర్ సమీక్ష

వడ్ల కొనుగోళ్లపై సివిల్ సప్లయీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శనివారం జిల్లాల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల్లో గోదాముల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లు ఎవరైనా నకిలీ రసీదులు (ఫేక్ షీట్లు) సృష్టిస్తే, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>