Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రమాదాలకు నిలయాలుగా కల్వర్టుల నిర్మాణాలు.. టీఆర్ఎస్ రాస్తారోకో

కలం, కరీంనగర్ బ్యూరో: అసంపూర్తి కల్వర్టు నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మానకోండూర్ (Manakondur) మండలం అన్నారంలో తెలంగాణ రక్షణ సేన (TRS) జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో దాదాపు మూడు గంటలపాటు మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరగా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విరమించబోమని స్పష్టం చేశారు. రోడ్డుపూ రాస్తారోకోతో నిర్బంధించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది. స్థానిక సిఐ శ్రీలత సంబంధిత ఎస్ ఈ అధికారితో మాట్లాడించినా వినలేదు. దీంతో స్థానిక మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. టిఆర్ఎస్ జిల్లా బాద్యుడు గుంజపడుగు హరిప్రసాద్ తో ఫోన్ లో సంప్రదించి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని, ముందుండి నిర్మాణం మొదలు పెట్టిస్తానని, ఆందోళన విరమించాలని కోరారు.

ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. మానకొండూరు నుండి అన్నారం, లలితాపూర్, పోచంపల్లి మార్గాల్లో ఉన్న కల్వర్టులు అద్వానంగా మారి ఘోర ప్రమాదాలకు నిలయాలుగా మారాయన్నారు. ముఖ్యంగా అన్నారం కల్వర్టు వద్ద కార్లు, లారీలు, బస్సులు, బైకులు ప్రమాదానికి గురికాని రోజంటూ లేదన్నారు. మానకొండూరు నుంచి శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగపూర్, వెల్ది, లక్ష్మీపూర్, వేగురుపల్లి, ఊటూరు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా గుంతల మయమైందని, ఫలితంగా ద్విచక్ర వాహనదారులు, కార్లు, బస్సుల ప్రయాణికులు గత 10 సంవత్సరాలుగా తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.

గతంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కవ్వంపల్లి సత్యనారాయణ ఇదే విషయంలో అనేక ఆందోళన చేసి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలోకి రాగానే రోడ్లన్నీ బాగు చేస్తామని మాటలు చెప్పి ఇప్పుడు మాత్రం ప్రజలను గాలికి వదిలేశారని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ రోడ్లను ఎందుకు బాగు చేయలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రోడ్లు ఇంత దారుణంగా తయారవడానికి ఇసుక మాఫియా కూడ ఒక కారణమని ఆరోపించారు. రోజు సుమారు 400 నుండి 500 ట్రాక్టర్లు, ఇసుక క్వారీలకు చెందిన వందలాది లారీలు ఓవర్ లోడ్‌తో ఇష్టానుసారంగా ఈ రోడ్లపై వెళ్లడం వల్లే ఉన్న కాస్త రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయని వారు అన్నారు. మరోవైపు మండలంలో రోడ్లు ఇంత అధ్వానంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారని గుంజపడుగు హరిప్రసాద్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానకొండూరు మండలంలోని రోడ్లను వెంటనే బాగు చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకురాలు కొలిపాక గౌతమి, గ్రామ నాయకురాలు కుసుంబ మంజుల రెడ్డి, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు లింగంపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి మానకొండూర్ ఇంచార్జ్ బుడిగె పరశురామ్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బండమీద అంజయ్య, చంటి శ్రీనివాస్, భాషవేణి రాజేందర్, నూతి సాయి చరణ్, మడి పెళ్లి వినీత్, లింగంపల్లి శ్రీనివాస్, జంగ అపర్ణ, కుతాడి రజిత, నవ్య, కొండపాక రాకేష్ కొత్తూరు రఘు, ఎండి హుస్సేన్, గర్షగుర్తి విద్యాసాగర్, ఆసియా సుల్తానా, కొరిమి పద్మ, గాజుల నవ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>