కలం, కరీంనగర్: తెలంగాణ రక్షణ సేనను (TRS) గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా బాధ్యుడు(TRS Leader) గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) తెలిపారు. ప్రజలకు తెలంగాణ రక్షణ సేన ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను తమ పార్టీనే పోషిస్తుందని పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు పొన్నం శిరీష, రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరిప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత పాంచజన్యంతో ప్రజల ముందుకు వచ్చిందని.. ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం, రైతుల సంక్షేమం, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం, సామాజిక తెలంగాణ నిర్మాణమే పార్టీ లక్ష్యమని అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని హరిప్రసాద్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడుతున్న ఏకైక నాయకురాలు కవిత అని అన్నారు. బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ఆమె పనిచేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు అంతర్గతంగా ఒక్కటయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుందని అన్నారు. తెలంగాణలో విద్య, వైద్యం వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. కవిత ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని హరిప్రసాద్ అన్నారు. తెలంగాణ సాధన కోసం ఏ హక్కుల కోసం పోరాడామో వాటిని తెలంగాణ రక్షణ సేన ద్వారానే సాధించుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, మానకొండూర్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు బుడిగె పరుశురాం గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, ఏనుగు మల్లారెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు సురేష్, రాజ్ కుమార్, బండ అశోక్, జంపాల రితేష్, అంబాల హరీష్, కొతురి నరేష్, గుండారపు కిరణ్, యువ నాయకులు నూతి సాయి చరణ్, మహిళా నాయకులు ఎండి సల్మా, అతాహర్, కొలిపాక గౌతమి, కుతాడి రజిత, జంగా అపర్ణ, దాసరి అంజలి తదితరులు పాల్గొన్నారు.

