కలం, వెబ్ డెస్క్ : ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి అప్పగించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ( TRS Chief Kavitha) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది” అంశంపై గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఫార్మా సిటీ భూసేకరణ కోసం తీసుకొచ్చిన జీవో 31ను వెంటనే రద్దు చేయాలని, రైతుల అంగీకారం లేకుండా భూములు సేకరించడం అన్యాయమని ఆగ్రహించారు. ఫార్మా సిటీ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన అబద్ధాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించడం, పోరాడటం, పరిష్కరించడం విధానం ద్వారా వెలుగుమట్లలో సమస్యను తీర్చిన విధంగానే ఫార్మా సిటీ బాధిత రైతుల సమస్య పరిష్కరించే వరకు తెలంగాణ రక్షణ సేన ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలందరినీ మోసం చేస్తోందని కవిత విమర్శించారు. బుల్లెట్ ట్రైన్, డేటా సెంటర్లు, భారీ ఎంఓయూల పేరుతో భూసేకరణను విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయితే డేటా సెంటర్ల వల్ల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అలాగే శబ్దానికి పక్షులు బతికే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. రైతులకు ఎకరాకు రూ. 8 లక్షల పరిహారం ప్రకటించడం సరిపోదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్యూచర్ సిటీపై ఫోకస్ పెడితే హైదరాబాద్ కోర్ సిటీ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు.
రైతుల పంట కొనుగోళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయాలనే అంశంపై చర్చ జరిగిందని కవిత సంచలన ఆరోపణ చేశారు. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయంపై ప్రజలకు నిజం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరగాలంటే పోరాటమే మార్గమని, ప్రభుత్వాలు దిగిరావాలంటే ప్రజలు గట్టిగా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు.

