మార్చిపోయే, మే వచ్చే.. ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ఏమాయే!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ‘ఇందిరమ్మ ఇండ్ల‘ (Indiramma Indlu) గురించి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, క్షేత్రస్థాయిలో మంజూరు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సొంత జిల్లా కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లపై గంపెడు ఆశలు నెలకొన్నాయి. సొంత స్థలం ఉంచి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు, అద్దె ఇండ్లలో మగ్గుతున్న సామాన్యులు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా? అని వేయికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

వేల సంఖ్యలో దరఖాస్తులు

ఇటీవల మంత్రి పొంగులేటి సొంత నియోజకవర్గం పాలేరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఇందిరమ్మ ఇండ్ల గురించే అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయం మంత్రే స్వయంగా వెల్లడించారు కూడా. ఇప్పటివరకు పాలేరు నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ప్రజా దర్బార్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి పొంగులేటి ఇండ్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వేల సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. గతంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారు. ఈ సారి ఎన్ని కేటాయిస్తారో ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఊరించింది. కానీ మార్చి పోయి, ఏప్రిల్ పోయి, మే వచ్చినా.. రెండో విడత ఇండ్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ సారైనా ఇళ్లు వస్తుందో రాదో అనే సందిగ్ధంతోనే ఇంటి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎల్ -1 లో పేరు ఉండి కూడా మొదటి విడత ఇళ్లు మంజూరు కానీ వాళ్ళు, కూడా జిల్లాలో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి రెండవ విడతలో వస్తుందా? లేదా అంతకంటే ముందే వస్తుందా? అనే అనుమానంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బడ్జెట్ కేటాయించినా..

మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం 2024 మార్చి 11న ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ పథకం కోసం 2025-26 బడ్జెట్లో రూ. 22,720 కోట్లు కూడా కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసి, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అమలుచేస్తుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ మార్చి నాటికి రెండో విడత ఇళ్ల పట్టాలు ఇస్తారని అందరూ భావించారు. ఎందుకంటే ప్రస్తుత సంవత్సరంలో కూడా మార్చిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టి రూ.5,500 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల కోసం నిధులు కేటాయించింది. దీంతో మార్చి నెలాఖరు నాటికైనా ఇళ్లు ఇస్తారనుకున్న వారికి నిరాశే ఎదురైంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 26 లక్షల మంది జనాభా ఉండగా, 8.5 లక్షల ఇళ్లు మాత్రమే ఉన్నాయి. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 30 వేల వరకూ మంజూరు కాగా, అందులో సుమారు 10 వేల ఇళ్లు గృహ ప్రవేశాలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో గృహాల కొరత తీవ్రంగా ఉంది. మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో చర్చనీయాంశంగా మారింది. త్వరితగతిన రెండో విడత మంజూరు ప్రక్రియను చేపట్టి పేదల సొంతింటి కలను సాకారం చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>