కలం, వెబ్‌డెస్క్: ఉప్పల్ బగాయత్‌లో తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్వర్యంలో తలపెట్టిన భూ పోరాట సభ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమకారుల ఇళ్ల స్థలాల సాధన కోసం సంకల్పించిన ఈ సభను పోలీసులు భగ్నం చేశారు. దీంతో టీఆర్ఎస్ చీఫ్ కవిత (Kavitha) ఆ సభను మేడిపల్లి చెంగిచెర్ల వద్ద నిర్వహించాలని భావించారు. అయితే పోలీసులు చెంగిచెర్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించి, భారీ బందోబస్తు నడుమ టీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సభా ప్రాంగణానికి చేరుకున్న టీఆర్ఎస్ చీఫ్ కవిత అక్కడ తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం చేసి బొడ్రాయి ప్రతిష్టించి పూజలు చేశారు. అనంతరం పోలీసులు కవితతో పాటు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారందరినీ బలవంతంగా అదుపులోకి తీసుకొని వాహనాల్లో ఎక్కించారు.
ప్రభుత్వం, పోలీసుల తీరుపై కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాని ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచి వేయాలని చేస్తోందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాక తప్పదని తెలిపారు. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని అధికారం దక్కించుకున్న నాయకులకు ఇప్పుడు వారి సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉద్యమకారుల సమస్యలపై, వారి హక్కుల సాధనకై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

