కలం, చండూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలు సహకరించాలని ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) కోరారు. మంగళవారం చండూరు ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే తమ పరిధిలోని బీఎల్ఓలను లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
ప్రతి ఓటరుకు అవసరమైన సహాయం అందించేందుకు ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొంతమంది ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో నివసించడం లేదని, వేరే ప్రాంతాలకు మారారని లేదా ఇతర ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్నారని బీఎల్ఓల ద్వారా సమాచారం అందుతోందన్నారు. అలాంటి వారు తప్పనిసరిగా సంబంధిత ఫారాన్ని పూర్తి చేసి తమ ప్రస్తుత వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆయన సూచించారు.
వేరే ప్రాంతంలో ఓటు ఉంటే ఆ వివరాలను ఫారంలో పేర్కొనడం ద్వారా అవసరమైన మార్పులు చేసి సరైన నియోజకవర్గంలో ఓటు కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ ఫారాలు సమర్పించకుండా ఎలాంటి స్పందన ఇవ్వకపోతే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలన అనంతరం ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చండూరు ఆర్డీవో శ్రీదేవి, చండూరు మండల తహసీల్దార్ రమాకాంత్ శర్మ, చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం, వివిధ పార్టీల నాయకులు, బీఎల్వోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

