కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురువారం రాష్ట్ర మంత్రుల భారీ పర్యటన జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో(Bhatti Vikramarka) పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒకేసారి మణుగూరుకు రానున్నారు. ఒకే రోజు నలుగురు కీలక మంత్రులు పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనను భారీ ఎత్తున విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
మంత్రుల బృందం పినపాక నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు(Sita Rama Project) పనులను పరిశీలించనుంది. ఇందులో భాగంగా మారెళ్లపాడు, సీతమ్మ బ్యారేజీ ప్రాంతాలలో జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పెండింగ్ పనులు, నిర్మాణ వేగం, భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
ప్రాజెక్టుల పరిశీలన కోసం వస్తున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయంగా, అభివృద్ధి పరంగా ప్రాధాన్యత ఏర్పడింది.

