కలం, వెబ్ డెస్క్: దేశంలో మరోసారి ఉగ్రవాదుల (Terrorists) కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ పాలసీ అమలు చేస్తున్న కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఉపా (UAPA) చట్టం కింద 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం ప్రకటించిన జాబితాలో ఉన్న 23 మందిలో ఆరుగురు భారతీయులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే మిగతా 17 మంది పాకిస్తాన్ పౌరులుగా కేంద్రం వెల్లడించింది. వీరంతా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రదాడులు, ఉగ్రవాదానికి ప్రోత్సాహం, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలాగే సరిహద్దు చొరబాట్లు, ఉగ్ర సంస్థలకు సహకారం, నిధుల సమీకరణ, యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించే చర్యలకు పాల్పడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.
తాజాగా విడుదలైన జాబితాతో దేశంలో ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరుకుంది. ఇలా అధికారికంగా ఉగ్రవాదుల వివరాలు వెల్లడించడం ద్వారా వారి ఉగ్ర కార్యకలాపాలను కొంత మేరకు అడ్డుకునే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

