కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని తెలంగాణ పీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తరఫున మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) వేసిన నామినేషన్ తిరస్కరణ, బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నికపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా మీనాక్షి నటరాజన్‌పై కేసు లేదన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసు రావడం జరిగిందన్నారు. నోటీసు విషయాలు మెన్షన్ చేయాలని నామినేషన్ పత్రాల్లో ఎక్కడా లేదన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్నారు. దేశంలో గాంధేయవాదాన్ని పాటిస్తున్న అతి తక్కువ మందిలో మీనాక్షి ఒకరన్నారు.
దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు జరగలేదన్నారు. మీనాక్షి నామినేషన్‌ను అకారణంగా తిరస్కరించారని చెప్పారు. ఇక జార్ఖండ్‌లో బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌లు తప్పుల తడకగా ఉన్నా మరోసారి నామినేషన్ తీసుకొని అంగీకరించారన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే బీజేపీ ఎంతటి వినాశకర రాజకీయాలు చేస్తుందో అర్థమవుతోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే మీనాక్షి కేసు గురించి వివరాలు అందించారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు ముమ్మాటికీ అవాస్తవమని మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు.

