కలం, వనపర్తి: నూతన మున్సిపల్ కౌన్సిలర్లకు మున్సిపల్ చట్టాలు, నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించాలని మాజీ కౌన్సిలర్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ను కోరారు. సోమవారం వనపర్తి ( Wanaparthy) మున్సిపల్ సమావేశానికి ముందు కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటి వరకు కౌన్సిలర్లకు మున్సిపల్ చట్టాలు, విధులు, అధికారాలపై ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలంటే జనరల్ ఫండ్, ఎస్డీఎఫ్ (SDF) నిధులు, కేంద్ర ప్రభుత్వ 15వ, 16వ ఆర్థిక సంఘం (Finance Commission) నిధులపై సమగ్ర అవగాహన కల్పించాలని కోరారు.
అలాగే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకువచ్చి వనపర్తి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అత్యవసర అవసరాల కోసం వినియోగించాల్సిన జనరల్ ఫండ్‌ను సివిల్ పనులకు మళ్లించకూడదని పేర్కొన్నారు. గతంలో పన్నుల వసూళ్లు సక్రమంగా లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోయామని, ఇకపై పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి 16వ ఆర్థిక సంఘం నిధులు పొందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

