కలం, వెబ్ డెస్క్ : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి (Lord Sri Venkateswara Swamy) సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల (Tirumala) లో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు గత రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేషునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తొమ్మిది రాష్ట్రాల కళాబృందాల సందడి
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వాహనసేవకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 19 కళాబృందాల్లో 549 మంది కళాకారులు జానపద, శాస్త్రీయ, సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ కళాకారులు తమ రాష్ట్రాల సంస్కృతిని ఆవిష్కరించారు. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ ‘కుట్రాల కురవంజి’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసుడు, పద్మావతి పరిణయ ఘట్టాన్ని నృత్యం, సంగీతం, అభినయంతో కళాకారులు ప్రదర్శించారు. అస్సాం కళాకారుల బిహూ నృత్యం కూడా భక్తులను ఆకట్టుకుంది.
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
బ్రహ్మోత్సవాల తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించిన సీఎం, అనంతరం మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం సీఎం శ్రీవారిని దర్శించుకున్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
మరోవైపు తిరుమలలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తొలుత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనాల వద్ద రిలయన్స్, భారత్ బయోటెక్ సంస్థలు టీటీడీకి విరాళంగా అందించిన ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి ఎస్వీ మ్యూజియం వరకు బస్సులో ప్రయాణించారు.
ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియం ప్రారంభం
ఆ తర్వాత ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని చంద్రబాబు ప్రారంభించారు. జీ+3 అంతస్తులతో ఉన్న మ్యూజియంలో 19 గ్యాలరీలు, సుమారు 14 వేల కళాఖండాలు ప్రదర్శనకు ఉన్నాయి. తిరుమలలో భక్తుల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు మొత్తం 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో రిలయన్స్ 25, భారత్ బయోటెక్ 7 బస్సులను టీటీడీకి విరాళంగా అందించాయి.

