కలం, నల్లగొండ : నల్లగొండ జిల్లా గుర్రంపోడు (Gurrampode) మండల పరిధిలో బుధవారం సాయంత్రం పెను ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, అజాగ్రత్త ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను బలితీసుకోగా, మరో ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. వద్దిరెడ్డిగూడెం గ్రామ శివారులో కారు, మోటార్ సైకిల్ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. నల్లగొండలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై, దేవరకొండ వైపు వెళ్తున్న కియా సెల్టోస్ కారు (TS 05 FP 2277), వద్దిరెడ్డిగూడెం శివారులో అతివేగంగా వచ్చి ఎదురుగా స్ప్లెండర్ బైక్‌ను (TS 05 EV 2192) బలంగా ఢీ కొట్టింది. కారు డ్రైవర్ అలుగుబెల్లి జైపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న నర్సింగ్ ధనుంజయ, నర్సింగ్ మధుబాబు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ప్రయాణిస్తున్న మరెడ్డి బాల్ రెడ్డి తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో ముగ్గురు మహిళలు మరెడ్డి అలివేలు, మాలె వెంకటమ్మ, మాలె మంజుల తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్రంపోడు ఎస్ఐ వెంకన్నకు కేసు విషయంలో పలు సూచనలు చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

