కలం, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ (Adilabad Region) పరిధిలో శుక్రవారం నిర్వహించిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) జేఏసీ కూటమి(JAC Alliance) ఐదు డిపోల్లో విజయం సాధించింది. పదేళ్ల విరామం తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం ప్రదర్శించడంతో నాయకులు, కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఉట్నూరు డిపోలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుండటంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. నిర్మల్ డిపోలో రాష్ట్ర గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ బస్సు గుర్తుకు 319 ఓట్లు రాగా, డిపో గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ నిచ్చెన గుర్తుకు 300 ఓట్లు వచ్చాయి. బైంసా డిపోలో ఈయూకు 177, టీఎంయూకు 178 ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ డిపోలో ఈయూకు 275, టీఎంయూకు 266 ఓట్లు వచ్చాయి. ఆసిఫాబాద్ డిపోలో ఈయూకు 151, టీఎంయూకు 142 ఓట్లు నమోదయ్యాయి. మంచిర్యాల డిపోలో ఈయూకు 244, టీఎంయూకు 208 ఓట్లు వచ్చాయి. ఉట్నూరు డిపోలో డిపో గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ నిచ్చెన గుర్తుకు 50 ఓట్లు రాగా, రాష్ట్ర గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూ బాణం గుర్తుకు 53, ఈయూ బస్సు గుర్తుకు 50 ఓట్లు వచ్చాయి. నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండటంతో వాటి లెక్కింపు అనంతరమే తుది ఫలితం వెల్లడికానుంది.
ప్రచారం చేసినా కూటమికే కార్మికుల మద్దతు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇస్తూ, టీడబ్ల్యూ బాణం గుర్తుకు ఓటు వేయాలని అధికార కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమిని సైతం మద్దతు కోరింది. అయినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్లోని ఐదు డిపోల్లో జేఏసీ కూటమి విజయం సాధించింది. ఫలితాల అనంతరం ఆయా డిపోల వద్ద నాయకులు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడం, కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

