కలం, వెబ్ డెస్క్ : అసురక్షిత ఆహారం, నకిలీ మందులు, నియంత్రణ ఉల్లంఘనలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత, ఔషధ నియంత్రణను ఒకే ఏకీకృత పరిపాలనా పరిధిలోకి తీసుకువస్తూ TG SAFE (Telangana Standards Authority for Food and Essential Drugs) ను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు కొత్త నిఘా వ్యవస్థకు ఏర్పాటు చేస్తూ టీజీ సేఫ్ (TG SAFE) కమిషనర్‌గా అవినాష్ మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహారం, ఔషధాల నాణ్యతపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణతో పాటు ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడమే టీజీ సేఫ్ ప్రధాన లక్ష్యం. ఇందులో నిఘా సమాచార సేకరణ, ప్రమాద ఆధారిత తనిఖీలు, ఉల్లంఘనలపై చర్యలు వంటి ఆరు విభాగాలు ఉంటాయి. ముఖ్యంగా పోలీసు సిబ్బంది మద్దతుతో పనిచేసే ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ ను ఏర్పాటు చేశారు.
ఈ వ్యవస్థను మొదటగా CURE (Core Urban Region Economy) ప్రాంతంలో అమలు చేయనున్నారు. అక్కడి అనుభవం, ఫలితాలను పరిశీలించిన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా టీజీ సేఫ్ కార్యకలాపాలు విస్తరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించనుంది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన టీజీ సేఫ్ ఆహార కల్తీ, నకిలీ లేదా నాసిరకం మందులు, నిబంధనల ఉల్లంఘనలపై స్పందించడంతో పాటు ఆహార భద్రత, ఔషధ నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో TG SAFE కీలక పాత్ర పోషించనుంది.
Also Read : కల్తీ మాల్.. ప్రాణాలకి డేంజర్ బెల్స్
Follow Us On: Instagram

