కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy) పోటాపోటీ ర్యాలీలకు సన్నద్ధం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. “కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు” అంటూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చిందని జేసీ ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ చెప్పారు. ఈక్రమంలోనేనా అటు “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో పాల్గొనడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి ఇంటినుంచి బయల్దేరారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు తలెత్తనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పెద్దిరెడ్డికి పోలీసులు సూచించారు.
ర్యాలీ వాయిదా వేసే ప్రసక్తే లేదని కేతిరెడ్డి చెప్పడంతో పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినకపోవడంతో కేతిరెడ్డి సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల ముప్పు దృష్ట్యా కేతిరెడ్డిని ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బలవంతంగా వాహనంలో ఎక్కించి తాడిపత్రి నుంచి బయటకు తరలించారు. కేతిరెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ ‘పెద్దారెడ్డి జిందాబాద్’ అంటూ రోడ్లపైకి వైసీపీ శ్రేణులు దూసుకొచ్చాయి. పెద్దారెడ్డి వాహనాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తల తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రి అంతటా భారీగా బలగాలు మోహరించడంతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.

