కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంలో తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర మహాసభలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభల సందర్భంగా గిరిజనులు తమ హక్కుల సాధనకు భారీ ప్రదర్శన, బహిరంగ సభను నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుంచి..
స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నుంచి పాత ఆర్డీవో కార్యాలయం రోడ్డులోని అమరజీవి సిద్ది వెంకటేశ్వర్లు స్మారక స్తూపం వరకు నిర్వహించిన ర్యాలీతో పాల్వంచ పురవీధులు గిరిజన జయధ్వానాలతో హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు, సీపీఐ, టీజీఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
హక్కులపై గళమెత్తిన నేతలు..
ర్యాలీ అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీపీఐ అగ్రనేతలు హక్కులపై గళమెత్తారు. ముఖ్య అతిథులుగా అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇన్‌ఛార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అనీ రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, టీజీఎస్ నేతలు ఎస్.కె. సాబీర్ పాషా, రామావత్ అంజయ్ నాయక్, రామ్మూర్తి నాయక్, ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్రావు, భూక్య శ్రీనివాస్, సొందే కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

