కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth games 2026) సమరానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది! విశ్వక్రీడల వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతబూని, దేశ జట్టును ముందుండి నడిపించే అరుదైన, అత్యున్నత గౌరవాన్ని ఇద్దరు లేడీ టైగర్స్ కైవసం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం మీరాబాయి చాను, బాక్సింగ్ పవర్‌హౌస్ లవ్లీనా బొర్గోహైన్‌లను ఈ ప్రతిష్టాత్మక క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత పతాక, బ్యాటన్ ధారులుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) శనివారం అధికారికంగా ప్రకటించింది. ఇద్దరు మహిళా ఛాంపియన్లు భారత జట్టును నడిపించడం దేశానికే గర్వకారణమని ఐఓఏ ప్రెసిడెంట్ పి.టి. ఉష ప్రశంసించారు.
ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా స్టార్లు యూకేలో పతకమే లక్ష్యంగా కఠిన శిక్షణలో మునిగిపోయారు. ఈ వారంలోనే ఐఓఏ భారత బృందాన్ని అధికారికంగా జెండా ఊపి పంపించడంతో పాటు, వారి స్పెషల్ జెర్సీలను, కిట్లను కూడా లాంచ్ చేసింది. ఈసారి మొత్తం 124 మంది అథ్లెట్లు (పారా అథ్లెట్లతో కలిపి) అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌తో సహా 10 క్రీడా విభాగాల్లో దేశం తరఫున రింగులోకి దిగుతున్నారు. ఈ పవర్‌ఫుల్ టీమ్‌ను చెఫ్ డి మిషన్ రోహిత్ రాజ్‌పాల్, డిప్యూటీ చెఫ్ డి మిషన్ రవి బెంగానీ ముందుండి నడిపించనున్నారు.
జులై 23న గ్లాస్గోలోని ‘ఓవీఓ హైడ్రో’ స్టేడియంలో మెగా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఒలింపిక్స్‌లో సత్తా చాటిన మీరాబాయి చాను (టోక్యో సిల్వర్, 2022 సిడబ్ల్యూజి గోల్డ్), లవ్లీనా బొర్గోహైన్ (టోక్యో బ్రాంజ్, 2023 వరల్డ్ ఛాంపియన్) ఇద్దరూ కేవలం టీమ్‌ను నడిపించే లీడర్లు మాత్రమే కాదు, మెగా టోర్నీలో మన దేశ ప్రధాన పతక ఆశలు కూడా! కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డును ఈసారి కూడా మాస్ పర్ఫార్మెన్స్‌తో కంటిన్యూ చేయాలని క్రీడా ప్రపంచం కోరుకుంటోంది.

