విద్యుత్ వినియోగదారులపై ‘ట్రూ-అప్‌ ఛార్జీల భారం.. 50 పైసలు అదనం

కలం, తెలంగాణ బ్యూరో: పండుగల వేళ ప్రభుత్వం షాకిచ్చింది. విద్యుత్‌ బిల్లులపై ‘ట్రూ-అప్‌’ ఛార్జీల (True-Up Charges) పేరుతో ప్రజలపై అదనపు భారం మోపింది. నవంబరులో ప్రతి యూనిట్కు 30 పైసలు, డిసెంబరు నుంచి 50 పైసల చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయనుంది. దక్షిణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర డిస్కం పరిధిలో 26 నెలల పాటు ఈ భారం కొనసాగనుంది. ప్రభుత్వ ప్రతిపాదనకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (TGERC) సోమవారం అనుమతిచ్చింది.

ఎల్‌ నినో కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగి కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్న వేళ.. కరెంటు బిల్లుపై ఈ అదనపు భారం వినియోగదారులకు మరింత గుదిబండగా మారనుంది. వ్యవసాయ మోటారు పంపుసెట్ల విద్యుత్‌ వినియోగానికి కూడా ట్రూ-అప్‌ ఛార్జీలు విధించారు. అయితే, ఈ మొత్తాన్ని రైతుల నుంచి నేరుగా వసూలు చేయకుండా ప్రభుత్వం వారి తరఫున డిస్కంలకు చెల్లించనుంది. ఇందుకోసం సుమారు రూ.214 కోట్లను ప్రభుత్వం భరించనుంది.

మూడు భాషల్లో ప్రచారం

డిస్కంలు ఇకపై జారీ చేసే బిల్లుల్లోనే ట్రూ-అప్‌ ఛార్జీలను కలిపి వసూలు చేయనున్నాయి. బిల్లులో ప్రత్యేకంగా ఈ ఛార్జీల వివరాలు, వసూలు చేసే విధానం, వర్తించే కాలవ్యవధిని స్పష్టంగా పేర్కొనాలని టీజీఈఆర్‌సీ ఆదేశించింది. దీనిపై వినియోగదారులకు ముందుగానే అవగాహన కల్పించాలని టీజీఈఆర్‌సీ డిస్కంలను ఆదేశించింది. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో ఈ వివరాలను ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేసింది.

రూ.7,635 కోట్ల వసూళ్లు

ప్రజలపై ట్రూ-అప్ చార్జీల పేరుతో భారం వేసినందున ప్రభుత్వానికి ఉత్తర, దక్షిణ డిస్కంల నుంచి సుమారు రూ. 7,635 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నది. రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్‌ కొనుగోళ్లు, ఆదాయ సర్దుబాట్ల పేరుతో ఈ ట్రూ-అప్‌ ఛార్జీలను వసూలు చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి విద్యుత్‌ కొనుగోలు ట్రూ-అప్‌ కింద రూ.5,186.29 కోట్లు, 2023-24 సంవత్సరానికి ఆదాయ ట్రూ-అప్‌ కింద రూ.2,448.93 కోట్లు వసూలు చేయనున్నారు.

మొత్తంగా ఈ రెండు రకాల ట్రూ-అప్‌ ఛార్జీల ద్వారా రూ.7,635.22 కోట్లు ప్రజల నుంచి రాబట్టనున్నారు. డిస్కంలవారీగా చూస్తే.. 2022-23 విద్యుత్‌ కొనుగోలు ట్రూ-అప్లో దక్షిణ డిస్కం వాటా రూ.3,329.97 కోట్లు కాగా, ఉత్తర డిస్కం వాటా రూ.1,856.32 కోట్లు. 2023-24 ఆదాయ ట్రూ-అప్లో దక్షిణ డిస్కం రూ.2,335.45 కోట్లు, ఉత్తర డిస్కం రూ.113.48 కోట్లు వసూలు చేయనున్నాయి. మొత్తంగా దక్షిణ డిస్కం పరిధిలో రూ.5,420.23 కోట్లు, ఉత్తర డిస్కం పరిధిలో రూ.1,197.30 కోట్లు రాబట్టనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>