కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని నర్సస్ అసోసియేషన్ (Telangana Nurses Association) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో పని చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ల యూనిఫాం డ్రెస్ కోడ్ మార్పుపై కీలక ప్రకటన వెలువడింది. డ్రెస్ కోడ్ పై నిర్వహించిన సర్వేలో 97 శాతానికి పైగా ఆఫీసర్లు మార్పునకే మద్దతు తెలిపారు. కాలానుగుణంగా ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేయాలని నర్సస్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నర్సింగ్ ఆఫీసర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 2,637 మంది ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. వీరిలో 20 శాతానికి పైగా అంటే 532 మంది పురుషులు, 79 శాతానికి పైగా అంటే 2,105 మంది మహిళలు ఉన్నారు. విభాగాల వారీగా పరిశీలిస్తే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుండి 650 మంది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి 1,514 మంది, తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుండి 316 మంది, అలాగే ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు చెందిన నర్సింగ్ ఆఫీసర్లు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు.
సర్వే ఫలితాల ప్రకారం దాదాపు 97.7 శాతం అంటే 2,576 మంది నర్సింగ్ ఆఫీసర్లు ప్రస్తుత యూనిఫామ్ డ్రెస్ కోడ్‌ను మార్చి, ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేయాలని కోరారు. కేవలం 2.3 శాతం అంటే 61 మంది మాత్రం ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ సర్వేలో ముఖ్యంగా 2011, 2021, 2024 బ్యాచ్‌ల నర్సింగ్ ఆఫీసర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్ జిల్లా నుండి అత్యధిక స్పందన నమోదైనట్లు వెల్లడించారు.
ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలులో ఉన్న విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ నర్సింగ్ (Telangana Nurses) ఆఫీసర్లకు కూడా సౌకర్యవంతమైన యూనిఫామ్ అమలు చేయాలని నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు. ప్రస్తుతం నర్సింగ్ ఆఫీసర్ల డ్రెస్ కోడ్‌పై అమలులో ఉన్న జీవోలో మహిళల యూనిఫామ్ గురించి మాత్రమే ప్రస్తావించారు. పురుషులు సేవలు అందిస్తున్నప్పటికీ వారి డ్రెస్ కోడ్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు.
ఈ జీవోను సవరించి మహిళా, పురుష నర్సింగ్ ఆఫీసర్లందరికీ ఒకే విధమైన ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేసినా ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడదని తెలంగాణ నర్సస్ అసోసియేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో మారుతున్న కాలాన్ని బట్టి తమ వృత్తి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే జీవోను సవరించి తాము కోరిన విధంగా యూనిఫామ్ డ్రెస్ కోడ్ అమలు చేయాలని నర్సస్ అసోసియేషన్ కోరుతోంది.
Read Also: ‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. మెట్రోలో పుస్తకాల యుద్ధం!
Follow Us On : WhatsApp

