అక్రమ పట్టా రద్దు చేయాలంటూ బాధితుడి గోడు

​కలం, ఖమ్మం బ్యూరో : అక్రమంగా తన వ్యవసాయ భూమికి పట్టా చేయించుకున్నారని, ఆ పట్టాను వెంటనే రద్దు చేయాలని ఖమ్మం(Khammam) జిల్లా కూసుమంచి(Kusumanchi) మండలం రావిచెట్టు తండాకు చెందిన శివలా డిమాండ్ చేశారు. తన సొంత కుమారుడు, మనవడి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసు అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో తన కోడలు తేజావత్ తులసి బాయితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివలా మాట్లాడారు. కూసుమంచి రెవెన్యూ పరిధిలోని తమ వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటుండగా తన కుమారులు, కోడళ్లు కలిసి తనపై దాడి చేశారని ఆరోపించారు. విచక్షణారహితంగా కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ భయం ఉందని వాపోయారు.

తేజావత్ తులసి బాయి మాట్లాడుతూ, గత నెల జూన్ 5న సాయంత్రం తన పొలంలో వరి నారుకు నీరు పెట్టేందుకు వెళ్లిన సమయంలో తన బావ, ఆయన కుమారుడు ట్రాక్టర్‌తో వచ్చి తన మామను బెదిరించి బలవంతంగా పొలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. తన మామ ఆ భూమిని తనకు కౌలుకు ఇచ్చారని, అప్పటి నుంచి ఆయన బాగోగులను తానే చూసుకుంటున్నానని తెలిపారు. రెండేళ్ల క్రితం తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆసరాగా తీసుకుని తనపై, తన పిల్లలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాళ్లు, కట్టెలతో దాడి చేసి గాయపరుస్తున్నారని, అవసరమైతే తనను హత్య చేసి అయినా భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా పొందిన పట్టాను (Illegal Land Patta) రద్దు చేసి, తమకు ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>