కలం, నిర్మల్: రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న అగ్రికల్చర్ గోదాం నిర్మాణానికి ఏలేటి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ గోదాం పూర్తయితే రైతులు తమ ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని, దీంతో నిల్వ సమస్యలు తగ్గి వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, నాయకులు జమాల్, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

