కరీంనగర్ అభివృద్ధే నా లక్ష్యం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) తెలిపారు. తన ధ్యాస, శ్వాస అంతా కరీంనగర్‌పైనే ఉందని, పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని కరీంనగర్ అభివృద్ధికి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వచ్చిన నిధులతో త్వరలోనే నగరంలోని గల్లీగల్లీలో సీసీ రోడ్లు నిర్మించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

కరీంనగర్ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి 36వ డివిజన్ మారుతీనగర్ నైస్ ఇండియా బిల్డింగ్ వద్ద రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో యూఐడీఎఫ్ నిధులు రూ.50 లక్షలు, జనరల్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు ఉన్నాయి. అనంతరం 27వ డివిజన్ శివాజీ నగర్‌లోని కరీంనగర్ డెయిరీ సమీపంలో రూ.49 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. బండి సంజయ్ రాక సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి పూలతో స్వాగతం పలికారు. స్థానికులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే స్మార్ట్ సిటీ పథకం కింద రూ.900 కోట్ల నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. అమృత్ 1, 2 పథకాల కింద రూ.279 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద వచ్చిన రూ.50 కోట్లతో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.156 కోట్లు మంజూరు చేసిందని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తాజాగా కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధులతో కరీంనగర్ కార్పొరేషన్ రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు.

కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు నిర్మించి, తెలంగాణలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని బండి సంజయ్ అన్నారు. తన ఏడేళ్ల ఎంపీ పదవీకాలంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు రూ.22 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజల కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని, కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>