కలం, వెబ్ డెస్క్: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ అభ్యర్థులకు శుభవార్త. 1,931 మహిళా ఏఎన్ఎం పోస్టుల (ANM Recruitment) కోసం నిర్వహించిన మే 14న పరీక్షకు సంబంధించిన తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది.
పరీక్షలో ప్రతిభ చూపినవారి వివరాలను ప్రకటించింది. ఫలితాలు విడుదలయ్యాక మే 18 నుంచి 22వ తేదీ వరకు తొలుత అభ్యంతరాలు స్వీకరించారు. వాటిని పరిశీలించిన బోర్డ్.. ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేసింది.
ఒక్కసారే అవకాశం.. జాగ్రత్త తప్పనిసరి
అభ్యర్థుల్లో ఎవరికైనా సందేహాలుంటే జులై 13వ తేదీ నుంచి 15 వరకు MHSRB వెబ్సైట్లో లాగిన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇది ఒక్కసారే అవకాశం ఉంటుంది కాబట్టి, జాగ్రత్తగా నమోదు చేయాలని బోర్డ్ సూచించింది.
ఈ అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక.. ఇక ఆయా పోస్టులకు ఎంపికైనవారికి నేరుగా నియామక పత్రాలు అందించబోతున్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం, ఇవి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రమే. భవిష్యత్తులో పర్మినెంట్ చేసే అవకాశం ఉండటంతో భారీగా దరఖాస్తు చేసుకున్నారు.

